సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా! |
తాత్పర్యం:
సరస్వతీ = ఓ సరస్వతీ దేవి, తుభ్యమ్ = నీ కొరకు, నమః = నమస్కారము వరదే = వరములు నిచ్చు దానా !, కామ రూపిణి = కోరిన, రూపమును ధరించు దానా ! విద్య = చదువుల యొక్క , ఆరంభం = ప్రారంభమును , కరిష్యామి = చేయబోవు చుంటిని మే = నాకు , సదా = ఎల్లప్పుడును , సిద్ధిః = విజయమును , భవతు = కలుగుగాక ! |
సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్
కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్
వహ్ని శుధ్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్
రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్
అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.
జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువులతల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు.
సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం
ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు.
సరస్వతీదేవి ని మాఘ శుద్ధ పంచమినాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు.
ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.
మాఘమాసం శిశిరఋతువులో వసంతుని స్వాగతచిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.
సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని. ఉత్పాదకతను పెంపొందిస్తుంది.
‘చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా’’ అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని, సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.
అమ్మవారికి తెల్లనిరంగు పువ్వులు లతో పూజలు,క్షీరాన్నం ,నేతి పిండివంటలు, చెరుకు,అరటిపండ్లు నివేదన చేస్తే మంచిఫలితాలు వస్తాయని
వసంత పంచమి శుభాకాంక్షలతో...
సేకరణ
గోగులపాటి కృష్ణమోహన్