Thursday, December 17, 2020

పాశురము - 8వ రోజు

 తిరుప్పావై --- 8 పాశురం



కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు

మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం

పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -

క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ

పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు

మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ

దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్

ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్


రాగం: చక్రవాకం


తూరుపు తెలవారె నెచ్చెలీ మేలుకో!

ఎనుములు చిరుబీడుకు మేయగా ఏగెనే

బాలికలందరు అదే పోతగా పోతుంటే

ఆపి, నిను పిలువగా వచ్చి నిలచి నామమ్ము // తూరుపు //

శ్రీకృష్ణు కీర్తించి పరవాద్యమును పొంద

కేశినోటిని చీల్చి, మల్లుర నణచిన

దేవదేవుని చేరి సేవించి నిలువగా

అయ్యో! మీరే వచ్చిరా అనుచు కటాక్షించు..

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.


ఈరోజు నిద్రలేపబోయే గోపిక కృష్ణుడికి కూడా ఆసక్తి కలిగించే విలాసవతి. కృష్ణుడి దగ్గరకు నేనెందుకు వెళ్లాలి? అతటే నా దగ్గరకు రావాలి అనే ధీమాతో పడుకుని ఉంది. పరమాత్మ మీద అంత అచంచలమైన విశ్వాసం ఉన్న ఆమె తమ తోడు లేకుంటే ఈ వ్రతం ముందుకు సాగదని తెలిసిన గోపికలు ఆమెను మేల్కొల్పుతున్నారు.


తూరుపు దిక్కున తెల్లని కాంతి వ్యాపిస్తుంది. మేతకు విడిచిన గేదెలు అన్ని దిక్కులకు వెళ్ళనారంభించాయి. మనతోటి పిల్లలు వ్రతస్థలానికి వెళ్లాలని బయలుదేరారు. శ్రీకృష్ణునివద్దకు వెళ్ళడం చాలా ముఖ్యమని భావించి వారందరూ అలా వెళ్తున్నారు. అలా వెళ్ళెవారిని నిలిపి మరీ నిన్ను పిలవడానికి నీ గుమ్మం ముందు నిలబడ్డాం. కుతూహలంగల ఓ పిల్లా తొందరగా నిద్ర లేచిరా!!. ఆ కృష్ణుని గుణగానము చేసి వ్రతానికి చాలా అవసరమైన పర అనే సాధనాన్ని సంపాదించి, కేశి అనే రాక్షసుని సంహరించి, చాణూర ముష్టికులనే మల్లయోధులను చంపిన ఆ భగవంతుని సమీపించి సేవించినపుడు అతడు మెచ్చుకుని "అయ్యో! మీరే వచ్చారా " అని బాధపడి మనను పరిశీలించి మన కోరికను నెరవేరుస్తాడు. కనుక వెంటనే లేచి రా" అని ఆ గోపికను మేల్కొలుపుతున్నారు.


సూర్యోదయానికి ముందు తూరుపు తెల్లబడటం అనగా మనలో సత్వగుణము ప్రభవించి, రాజస తామస భావాలు తగ్గడం. అదే జ్ఞానోదయానికి ముందు కలిగే మానసిక పశాంతత. భక్తులందరూ సాధారణంగా భగవంతుడిని మేల్కొలుపుతారు. కాని గోదాదేవి మాత్రం భగవంతుని ప్రియ భక్తులను మేల్కొలుపుతుంది. శ్రీకృష్ణుడు కేశి అనే రాక్షసుని చంపాడని కీర్తిస్తున్నారు. ఈ కేశి అనేది అహంకారము. మనలోని అహంకారం, మమకారాలను పట్టి చీల్చవలసింది ఆ పరమాత్మే కదా.. అదే విధంగా మనలోని కామ క్రోధాలనే మల్లురను కూడా ఆ దేవదేవుడే తొలగించాలి. పరమాత్మను మేము ప్రత్యక్షంగా చూసామని ఎవ్వరూ చెప్పలేరు. అలా చెప్పేవారంతా మానసిక సాక్షాత్కారం పొందినవాళ్లే. కాని ముదలాళ్వార్లు ముగ్గురు, పెరియాళ్వార్లు మున్నగువారు ఆ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా దర్శించారు. అలాగే మొన్నా, నిన్నా, ఇవాళ మేల్కొన్న గోపికలు ముగ్గురూ భగవదనుభవంలో మునిగి ప్రపంచాన్ని మరచి సుషుప్తిలో ఉండిపోయారు.

Tuesday, December 15, 2020

పాశురము - 7వ రోజు

 తిరుప్పావై --- 7 పాశురం



కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు

పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే

కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు

వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్

ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో

నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి

కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో

తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్.



కీశూకీశు మనుచు ఏటిరింతలు కలసి

ఊసులాడెనదె! వినలేదా వెర్రిదానా!

కాసుల పేరుల, కొప్పుల ఘుమఘుమలు

కవ్వముల చిలుకు పెరుగు సవ్వడి వినలేదా //కీశుకీశు//

గోపికా నాయకీ! నారాయణుని మూర్తి

కేశవుని నామములు పాడగా వింటివా? పరుంటివా?

తేజోవతీ లేచి తెరువవే తలుపు

జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము.


నిన్న ఒక గోపికను మేల్కొల్పడంలో శ్రీవ్రతం మొదలైంది కదా. ఈరోజు శ్రవణము లో వైవిధ్యమును వివరిస్తూ ఇంకో గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. వేదపఠనము, శుభకార్యము మొదలుపెట్టేటప్పుడు శ్రీ గురుభ్యోనమః, హరిః, ఓమ్ అని ప్రారంభిస్తారు. నిన్న పక్షుల శబ్దములు, శంఖనాదము, హరి హరీ అనే ధ్వనులు వినలేదా అని గోపికను అడిగారు. దీనివలన గురువును, హరిని తలుచుకున్నట్టుగా భావించాలి. ఈ పాశురంలో భగవన్నామ శ్రవణంలో గల ప్రాముఖ్యాన్ని వివరిస్తున్నారు. భరద్వాజ పక్షులు తెల్లవారుఝామునే లేచి అన్ని వైపులలో ఉన్న పక్షులను కలుపుకుని మాట్లాడుతున్నాయి. ఆ ధ్వని నీకు వినపడలేదా? ఓసి పిచ్చిదానా! పువ్వులు ముడిచిన కొప్పులు విడిపోగా పరిమళాలు వెదజల్లుతున్న గొల్లభామలు కవ్వముతో పెరుగు చిలుకుతుంటే వారి గాజుల గలగలలు, వారి మెడలోని ఆభరణాల ధ్వని, మంగళసూత్రముల చప్పుడు, వారు చిలుకుతున్న పెరుగు సవ్వడి నీకు వినపడలేదా? ఓ నాయకురాలా! ప్రపంచమంతా తన ప్రేమ వాత్సల్యాలతో వ్యాపించియున్న పరమాతం మనకు కనపడాలనే మానవదేహాన్ని ధరించి శ్రీకృష్ణుడై అవతరించాడు. లోకకంటకులైనవారిని సంహరించిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తిస్తుంటే కూడా నీకు వినపడలేదా? విని కూడా మేల్కొనడంలేదా? నీ తేజస్సు మాకు అగుపిస్తున్నది. లేచి ఇకనైనా తలుపు తెరువుము అని మేల్కొలుపుతున్నారు ...


భరద్వాజ పక్షులు మామూలు పక్షులు కావు. వాటి మాటలు మామూలు మాటలు కావు. ప్రయాణానికి పోయేవాళ్ళు త్రోవలో తినడానికి మూటకట్టుకున్నట్లు ఈ పక్షులు ఉదయాన్నే లేచి పగలంతా కలిగే ఎడబాటులో తమకు తోడుగా ఉండడానికి, గుర్తుచేసుకోవడానికా అన్నట్టు ముచ్చట్లాడుతున్నాయి. ఆ మాటల ధ్వని వినపడలేదా అని గోదాదేవి అడుగుతుంది. వ్రేపల్లెలో గోపికలకు పెరుగు చిలకడం అనేది నిత్యకృత్యం. ఎంతటివారైనా తమ నిత్యకృత్యములను ఎప్పుడూ మరచిపోరాడు. వీడరాదు. చల్ల చేసేటప్పుడు పాటలు పాడుకుంటూ తన్మయులై ఉన్న గోపికల కొప్పులు ఊడిపోయి పూవులు జారిపోయి వాటి పరిమళాలు వ్యాపించాయి. వారి ఆభరణాలు, చేతి గాజులు గల్లుగల్లుమంటూ చప్పుడు చేస్తున్నాయి. అమృతాన్ని సాధించడానికి ఆనాడు దేవతలు, రాక్షసులు చేసిన క్షీరసాగరమధనం లాంటిదే ఈ గోపికల నిత్యకృత్యం. మనము మధించే క్షీరసాగరం ఆ పరమాత్మ.అందలి పాలు ఆ దేవుని రూపం, గుణగణాలు. వానిని మననం చేయడమే మధించుట. దానికోసం ఆ దేవునిపై నిలిపిన పట్టుదల మంధరపర్వతం. దానికి కట్టిన తాడే మన శ్రద్ధ, ఇష్టము. ఈ మధనంలో జరిగే పోరాటంలో దైవశక్తులు జయించి మనకు భగవతుని సాన్నిధ్యం లభిస్తుంది.


నిన్నటి పాశురంలో, ఈ పాశురంలో ఎక్కువగా వినడం గురించి ప్రస్తావించారు. ఈ రెండు పాశురాలు ఆధ్యాత్మిక సాధనకు ప్రధమ సోపానమైన శ్రవణం యొక్క ప్రాధాన్యతను వివరిస్తున్నాయి. ఇందులో మనకు చెప్పినవి పక్షుల కలకలం, భరద్వాజ పక్షుల మాటలు. ఈ రెండూ వేదశాస్త్రాలను వినడం గురించి ప్రస్తావిస్తున్నాయి. రెండోది దేవాలయంలో మ్రోగించు శంఖద్వని, పెరుగు చిలికే గోఫికల గాజులు, నగలు, పెరుగు సవ్వడి . వారు కనపడకున్నా ఈ శబ్దాలను బట్టి ఊహించుకోవడమన్నమాట. మూడవది మునులు, యోగులు గానం చేస్తున్న హరీహరీ అనే శబ్దం. ఇది ఆచార్యోపదేశము వంటిది.. అన్నీ ముఖ్యమైనవే. వీరు ఆ గోపికను పిచ్చిపిల్లా, నాయకురాలా! తేజశ్సాలినీ! అని మూడు విధాల పిలిచారు. భగవంతుని అనుగ్రహం కల్గి బ్రహ్మ తేజస్సు నీలో కనిపిస్తుండగా లేదనడం తగినపని కాదు... ఆ అనుభవం నీవు ఒక్కదానివే అనుభావిస్తున్నావు అలా తగదమ్మా!ఏమమ్మా నీకు పిచ్చా అని వీరడుగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ రెండవ గోపికను నిద్రలేపి ముందుకు సాగారు..


పాశురము - 6వ రోజు

 తిరుప్పావై --- 6 పాశురం



పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్

వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో

పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు

కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి

వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై

ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం

మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం

ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్


రాగం: భూపాల


పక్షులు కూసెనులే! పక్షివాహను గుడిని

తెలి సంకు పొలికేక వినలేదటే!

బాల మేలుకొనవే.. // పక్షులు //

పూతన స్తనముల విషమును పీల్చి

కపట శకటమును కాల్చాచి కూల్చి

పాల్కడలిలో యోగ నిద్రలో నున్న విష్ణుని

ఉల్లమున నిలిపి మునులు యోగులు

మెల్లగా లేచి "హరిహరీ" అని పాడ

హృదయములు కదలాడి ఆహ్లాదమును తేల

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.


గోదాదేవి వ్రతారంభం చేద్దామని గోపికలతో చెప్పగానే ఉదయాన్నే నిద్ర లేచారందరూ.. కాని ఇంకా పది మంది గోపికలు మేల్కొనలేదని తెలుసుకుని మరికొందరు గోపికలను తోడ్కొని వెళ్లింది. భగవంతుని ఆశ్రయించినప్పుడు మన ఒక్కరి సంకల్పము, ప్రయత్నముతోనే అది సాధ్యం కాదు. ఆ భగవంతుని సేవించే నిష్ణాతులైన వారి సహకారం తీసుకోవాలి. . మనకు సర్వాన్ని ఇచ్చే పరమాత్మను చేరడానికి యోగ్యులుగా చేసేవాడు గురువు. అతని ద్వారా ఆ స్వామిని చేరగలుగుతున్నాము. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆండాల్ తల్లి భగవదనుభవ నిష్టలైన పదిమంది గోపికలను మేల్కొలిపి, వారిని తోడ్కొని కృష్ణుని సన్నిధికి వెళ్తుంది.


ఇక్కడ మరో విషయం చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడు ఆ కృష్ణుని చేరుకుందామా అని ఆత్రుతతో నిద్ర రాక ఉండవలసిన వాళ్లు అలా నిద్రపోవటమేంటి? నిద్ర అనగా అన్ని ఇంద్రియ వ్యాపారాలు మాని మనసు విశ్రాంతి తీసుకోగా ఆత్మ, పరమాత్మతో చేరి ఉంటుంది. ప్రతీ నిత్యం ప్రతీ జీవునికి సుషుప్తిలో జరిగేది ఇదే... కాని మన సుషుప్తిలో అజ్ఞానం మనను కప్పివేయడం వల్ల ఆ దివ్యానుభూతిని పొందలేకున్నాము. యోగులవలె ఆ పదిమంది గోపికలు సాత్వికమైన సుషుప్తిలో ఉన్నారు. అందరిలోకి చిన్నదైన ఉత్తిష్టను ఇలా మేల్కొలుపుతుంది గోదాదేవి. " ఆహారం సంపాదించుకోవడానికి పక్షులు అప్పుడే లేచి కలకలలాడుతూ వెళ్తున్నాయి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునికి స్వామి అయిన శ్రీమహావిష్ణువు ఆలయంలోని తెల్లని శంఖము స్వామి సేవకు వేళయింది రమ్మని పిలుస్తుంది. ఆ శబ్దం వినపడలేదా పిల్లా! లే ఇంకా పడుకున్నావ్.. మేము ఎవరూ లేపకుండానే లేచామనుకుంటున్నావా? పూతన స్తన్యమున విషాన్ని తాగినవాడు, శకటాసురుని కాలితో తన్ని కూల్చినవాడు, పాలసముద్రంలో ఆదిశేషునిపై యోగనిద్రలో నున్న మహావిష్ణువును తమ మనసులో పదిల పరుచుకుని మునులు, యోగులు చేస్తున్న హరీ హరీ అనే సంకీర్తనాలు మా మనసులోకి చేరి మమ్మల్ని గాఢనిద్రనుండి మేల్కొలిపాయి. ఓ పిల్లా! లే! నీవు కూడా లేచి రా" అని ఆ ముగ్ధను మేల్కొలిపారు. ఆమె లేచి వారితో కలిసింది.


ఈ పాశురంలో పది మంది గోపికలు, పూతన, శకటాసురుల ప్రస్తావన వెనకల పరమార్ధం ఉంది . ఈ పాశురంలో పదిమందిని మాత్రమే మేల్కొల్పడం గల విశేషం ఏమిటంటే... విష్ణు ఆలయాలలో మూల విగ్రహంతోపాటుగా పదిమంది ఆళ్వారులను కూడా ప్రతిష్టిస్తారు. ఆలయానికి వెళ్లినప్పుడు ముందు ప్రదక్షిణం చెసి ఆల్వారులను సేవించి , ద్వజస్తంభమునకు నమస్కరించి , అమ్మవారిని సేవించిన తర్వాతే మూలవిరాట్టును సేవించడం ఆచారంగా వస్తుంది. ఆ పదుగురిని సేవించి వారి కటాక్షము మనపై పడునట్లు చేసుకోవడమే ఆ పదిమంది గోపికలను మేల్కొలపడం. పూతన వృత్తాంతము కూడా మనకు కొన్ని గుణపాఠాలు నేర్పుతుంది. ఈ ప్రకృతి అనే పూతన అహంకార, మమకారాలు అనే స్తనముల ద్వారా విషయ భోగాలు అనే విషాన్ని ఇచ్చి మనను చంపుతుంది కాని పోషింపదు. అందుకే అది పూత న.. పవిత్రము గానిది అని అర్ధమవుతుంది. శకటాసురుని వృత్తాంతంలో ఆ బండి మన దేహము, దాని చక్రాలు పాపపుణ్య కర్మలు, అహంకార, ఆవేశాలతో ప్రవర్తించినపుడు ఆ భగవంతుడి పాదాలు తాకినంతనే ఆ చక్రాలు విరిగిపోయి మనకు మోక్షము లభిస్తుంది.

పాశురము - 5వ రోజు

 తిరుప్పావై --- 5 పాశురం



మాయనై మన్ను వడమదురై మైందనై

తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై

ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై

తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై

తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు

వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క

పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం

తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్


రాగం: కమాస్


మాయావి మన మధుర అధినాధుడు హరీ!

కూలంకష స్వచ్చ యమునా తీర విహారీ!

గోపాల వంశమున భాసించు మణిదీపము

తల్లి కడుపునకు చల్లని వెలుగు దామోదరు దరికి

పరిశుద్ధిగానేగి సుమముల రువ్వి, సేవించి

నోరార కీర్తించి - మనసారా ధ్యానింప

ఆగామి సంచిత పాపమ్ములన్నియు

నిప్పులో తూలికలగును నామమనుసంధింప

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము+++++++++++++++++


గోదాదేవి పిలుపును అందుకున్న గోపికలందరూ వ్రతాన్ని మొదలుపెట్టడానికి ఒక చోట చేరారు... ఎంత గొప్పవారికైనా శుభకార్యాలకు పూనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అలాగే తాము మొదలుపెట్టబోయే వ్రతానికి గతంలో చేసిన పాపాలు ఆటంకములవుతాయేమో అని సందేహించారు. మనము తెలిసీ తెలియక చేసిన పాపాలకు ప్రాయశ్చితం చేసుకొని మరలా ఆ పాప కర్మల జోలికి పోకుండా ఉంటేనే ఈ వ్రతఫలం దక్కుతుంది ఆ కృష్ణుడి సేవాభాగ్యం లభిస్తుంది అని ఒక గోపిక చెప్పింది. అసలు కర్మంటె ఏమిటి అన్న చర్చ జరిగింది. ఎన్ని పాపాలు చేసినా మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను దర్శించినంతనే కర్మలన్నియు మాసిపోతాయి అని ఉపనిషత్తులే చెప్పాయి. మన కర్మలకు ఫలాన్ని ఇచ్చేది భగవంతుడే కాని కర్మలు కావు.


మనము చేసిన పుణ్యకర్మల వల్ల సుఖము, పాపకర్మల వల్ల దుఖము లభిస్తుందని అనుకుంటాము కాని ఇది సరి కాదు. ఏ కర్మ చేస్తే పరమాత్మ అనుగ్రహం లభిస్తుందో అది పుణ్యకర్మ, ఏ కర్మ చేసినందువల్ల ఆగ్రహం లభిస్తుందో అది పాపకర్మ. పెద్దల ఆచరణను బట్టి మన ప్రవర్తనను దిద్దుకుని భగవంతుని అనుగ్రహానికి పాత్రులము కావాలి. అప్పుడే మనం గతజన్మలో చేసిన కర్మలు నిప్పులో వేసిన దూదిలా నశిస్తాయి. ఈ జన్మలో కర్మలు తామరాకు మీది నీటి బొట్టులా నిలవవు. మనం శ్రీమన్నారాయణుడే సర్వస్వమని నమ్మినవారము అందుకే భగవంతుడు మనను ఎల్లప్పుడూ సుఖంగా ఉండేలా చేసి తనలో ఐక్యం చేసుకుంటాడు. గోదాదేవి శ్రీవ్రతము నిర్విఘ్నముగా జరగడానికి తమ కర్మలు తొలగి వారు కోరిన ఫలాన్ని పొందుటకు గల సులభమైన ఉపాయాన్ని చెప్తుంది గోపికలకు... శ్రీకృష్ణుడే ఈ వ్రతానికి అధినాయకుడు. అతని చేష్టలు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. భగవంతునితో సంబంధం కలిగిన ఉత్తర మధురకు నాయకుడు. నిర్మలమైన జలముగల యమునా నదీ ఒడ్డున నివసించేవాడు, మనకొరకే యదుకులమున అవతరించిన మహానుభావుడు, తన పుట్టుకతో యశోధకు శోభను కలిగించిన మంగళమూర్తి. అందుకే మనము ఎటువంటి సందేహాలు లేకుండా నిర్మల మనస్సుతో వెళ్ళి పవిత్ర పుష్పాలను అర్పించి, నమస్కరించి, నోరారా కీర్తించి, ధ్యానించినంతనే గత, వర్తమాన జన్మలో చేసిన కర్మలన్నీ అగ్నిలో వేసిన దూదిలా భస్మమైపోతాయి. మన వ్రతానికి ఎటువంటి ఆటంకము కలగదు. అందుకే రండి ఆ భగవంతుని కీర్తిద్దాం.

ఇంతవరకు మొదటి ఐదు పాశురాలలో గోదాదేవి గోపికలను వ్రతానికి సన్నద్ధం చేసింది ఇక రే పటినుండి శ్రీవ్రతము లేదా తిరుప్పావై వ్రతము మొదలవుతుంది.


పాశురము - 4వ రోజు

 తిరుప్పావై --- 4 పాశురం


ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్

ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి

ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు

పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్

ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు

తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్

వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్

మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్


రాగం: అమృత వర్షిణి


పర్జన్యదేవ! పాలింప రావా!

సంద్రమ్ముపై వ్రాలి సలిలములు త్రావి

ఆది దేవుని వోలె ఆతసీదేహుడవై

ఆకసము పైకెక్కి గర్జించుమా! //పర్జన్య//

సుందర బాహు అరవిందనాభు హస్తాన

చక్రమ్ము వలె మెరసి, శంఖమ్ము వలె ఉరిమి

శార్‌జ్ఞ నిర్ముక్త శర పరంపరగా

లోకమ్ము హర్షింప వర్షమ్ము కురియుమా!

మార్గశిర స్నానమ్ము చ్సి తరించెదము

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము


ఈ పాశురంలో గోదాదేవి మన సర్వస్వం ఆ భగవంతుడే అనే భావనతో ధనుర్మాస వ్రతం ప్రారంభిస్తే ఆతని వద్ద వినయవిధేయతలతో మెలిగిన దేవతలందరూ మనకు కూడా వశులైపోతారు అని నిరూపిస్తూ పర్జన్య దేవుడిని ఇలా ఆదేశిస్తుంది.. " గంభీరమైన స్వభావము కలిగి వర్షం కురిపించే మేఘదేవా! నీ దాతృత్వంలో ఏమాత్రం సంకోచించవద్దు. నీ ఔదార్యంలో ఇసుమంతైనా వెనకడుగు వేయకు. నడి సముద్రం మధ్యలోకి వెళ్లి అడుగు వరకు నీరంతా బాగా త్రాగి గర్జించు..తర్వాత మెల్లిగా గర్భిణీ స్త్రీవలె నిదానంగా మేడ మెట్లెక్కినట్లు పైకి వెళ్ళి ఆకాశమంతా వ్యాపించు. సమస్త జగత్తులకు కారణభూతుడైన శ్రీమన్నారాయణుని శరీరమువలె దివ్యమైన నలుపును ధరించుము. అటుపిమ్మట ఆ భగవంతుని సుందరమైన విశాల దీర్ఘబాహువుల జంటలో కుడిచేతిలోని చక్రమువలె మెరుస్తూ, ఎడమచేతిలోని శంఖమువలె ఉరుముతూ, శ్రీమహావిష్ణువు చేతిలోని విల్లు శార్గము నుండి వెలువడే బాణములవలె వర్షధారలను కురిపించుము. ఆ వర్షధారలు లోకాన్నంతటినీ సుఖింపచేయగా మేము సంతోషంతో ఆ మార్గశిర స్నానం చేసి శ్రీవ్రతము చేస్తాము.


చూడడానికి ఈ పాశురం వర్షం కొరకు ప్రార్ధించినట్లు కనిపించినా అసలు అంతరార్ధం వేరే ఉంది. గోదాదేవి ప్రకృతిలో భగవంతుని , భగవంతునిలో ప్రకృతిని దర్శించింది. ప్రకృతిలో కాని అందమైన వస్తువులో భగవంతుని దర్శించకున్నా అందులో ఏదో లోతు ఉంటుంది. ఇందులో మనకు మేఘానికి, గురువుకు గల కొన్ని పోలికలు గోచరిస్తున్నాయి. మేఘము సముద్రంలోని ఉప్పునీటిని త్రాగి మనకు మంచి నీరును ఇస్తుంది. అదే విధంగా గురువు కూడా క్లిష్టమైన వేదార్ధాలను సరలము, సులభము చేసి మనకు అందిస్తారు. ఎడారి, పొలము, పల్లము, మెట్ట అనే తేడా లేక మేఘం అన్ని చోట్లా వర్షిస్తుంది. అలాగే గురువులు కూడా తన శిష్యులలో తక్కువవారు, ఎక్కువవారు, గుణవంతుడు, గుణహీనుడు, తెలివైన వాడు , తెలివిలేనివాడు అన్న తేడా లేకుండా అందరికీ విజ్ఞానమందిస్తారు. మేఘము , గురువులు ఇద్దరూ ప్రత్యుపకారాన్ని ఆశించరు. మేఘము తన నీరంతా ఇచ్చేసి వెలవెలపోతుంది. అలాగే గురువు తన విద్యనంతా ఇచ్చినా ఇంకా ఇవ్వలేకపోతున్నానే అని బాధపడతాడు. వర్షం ఏ చోట పడినా ఆయా స్థానాలను బట్టి ముత్యపు చిప్ప, తామ్రాకు, కాలినపెనం .. నీటి రూపం మారుతుంది. అలాగే గురువు అందరికీ సమానంగా బోధించినా శిష్యుల యోగ్యతలను బట్టి వేర్వేరు ఫలితాలనిస్తాయి. ఒక్కోరు ఒక్కో విధంగా వృద్ధిలోకి వస్తారు. మేఘుడికి ఉరుము, మెరుపు ఉన్నట్టే గురువుకు కూడా జ్ఞానము, ఆచరణ రెండూ ఉంటాయి. ఇద్దరూ పరిపూర్ణులే...

Monday, December 14, 2020

పాశురం - మూడవ రోజు

 తిరుప్పావై --- 3 పాశురం



ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి

నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్

తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు

ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ

పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప

తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి

వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్

నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్


రాగం: కేదారగౌళ


పెరిగి లోకాలు కొలిచిన పురుషోత్తముని కీర్తించి

నోము పేరున కలిసి మేము నీరాడితే, దేశమంతా

నెల మూడు వానలు కురిసి ఈతిబాధలు తొలగు //పెరిగి //

పెరిగిన ఎఱ్ఱని వరిచేల పైకెగురు చేపలు

నీరజముల మెరసి నిదురించి తుమ్మెదలు

స్థిరముగ కూర్చుండి సిరములను లాగ

కలశములను నింపు కామధేనువులు

నిత్య సంపదలతో నిండుగా నుండు

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము..



ఇది ఆశీర్వచన పాశురం. ఎక్కడ శుభకార్యం జరిగినా పెద్దలు ఈ పాశురాన్ని చదువుతారు. త్రివిధ తాపములు (తాపత్రయములు) తొలగి అన్నీ సమృద్ధిగా ఉండాలని కోరుకుంటారు. అంతే కాక ఈ పాశురంలో శుభప్రదమైన వామనావతారం ప్రస్తావన వస్తుంది. పూర్వము దేవతలను కాపాడటానికి శ్రీహరి వామనావతారం ఎత్తి పెరిగి లోకాలను తన కాలితో కొలిచిన పురుషోత్తముని కొలిచి నామసంకీర్తనం చేసి వ్రతస్నానం చేసినంతనే దేశమంతా నెలకు మూడు వానలు కురిసి, ఈతిబాధలు లేకుండా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండును. పచ్చగా పెరిగిన పంటచేలలోని నీటిలో చేపపిల్లలు త్రుళ్లి పడుతుండగా, కలువపూలలో మెరిసే తుమ్మెదలు నిద్రిస్తుంటే బాగా పెరిగిన వరిచేలు ఆనందాన్ని ఇవ్వాలి. గోపాలురు పాలు పితకడానికి కొట్టములలో ప్రవేశించి, స్థిరముగా కూర్చొని బలిష్టమైన పొదుగులను పిండగానే కుండలనిండుగా క్షీరధారలు కురిసే గోసంపద సమృద్ధి కావాలి. వామనుడు త్రివిక్రముడైనట్టు దేశమంతా నిత్య సంపదలతో, ఆనందంతో తులతూగాలని గోదాదేవి ఈ పాశురంలో కోరుకుంటుంది..


అహంభావియైన బలి వామనునికి ఇచ్చిన మూడు అడుగులు - అహంకారము, మమకారము, అవిద్య. అహంకారము పోవుట అంటే పరమాత్మకు సొంతమైనది అతనికే అర్పించడం. మనదంటూ ఏమీ లేదు అంతా ఆ భగవంతుడితే అని అర్ధం .. వామనావతారాన్ని కీర్తించి వ్రతస్నానాన్ని చేస్తే నెలకు మూడు వర్షాలు కురుస్తాయట? ఏమిటా మూడు వర్షాలు ?1.అనన్య శేషత్వము (నీకే నీకే చెందినవాడను) 2. అనన్య శరణత్వము (నీవే నీవే నాకు ఉపాయము) 3. అనన్య భోగ్యత్వము (నీవే తప్ప అన్యము నాకు భోగ్యం కాదు). దీనినే అకారగ్రయజ్ఞానమందురు.ఈ జ్ఞానవర్షము కురిసినపుడు ఆత్మ పచ్చగా సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ వ్రతఫలములో మరో విశేషము ఈతిబాధలు 1. అతి వృష్టి 2. అనావృష్టి. 3. ఎలుకలు 4. చిలుకలు 5. మిడతలు 6. క్రూరులైన రాజులు .. ఇవి తొలగిపోవును. ఈతిబాధలు తొలగి పంటలు విరివిగా పెరిగి ఆ వరిచేలలోని నీటిలో చేపలు సంతోషంతో త్రుళ్లిపడుచుండును. శ్రీహరిని చూసి ఆనంద పరవశులైన ఇంద్రాది దేవతలే ఆ చేపలు. భగవంతుని అనుగ్రహం పొందిన జీవులే సమృద్ధిగా పండి నీటితో నిండి వంగిన వరిచేలు. ఈ చేలలోని నీటి అడుగున కలువపూలు వాటిలో నిద్రిస్తున్న తుమ్మెదలు. ఈ పూవులు జ్ఞానుల హ్రదయాలు అందులో లక్ష్మీ సమేతుడైన నారాయణుడు తుమ్మెదలా ఉయ్యాలలూగుతున్నాడు. వ్రేపల్లేలోని పాడి అనగా గురువులు. పాలను పితుకువారు శిష్యులు. అనగా భక్తితో, స్ధిరముగా సేవించినపుడు గురువులు గోవులవలె సర్వ విద్యలను అందిస్తారు. అందుకే ఈ వ్రతము చేసినంతనే నిత్య సంపదలతో దేశమంతా సుభిక్షంగా ఉంటుంది అని గోదాదేవి కోరుకుంటుంది..

పాశురము - రెండవ రోజు

 తిరుప్పావై --- 2 పాశురం



వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు

శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్

పైయత్తుయిన్ఱ పరమనడి పాడి

నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి

మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్

శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్

ఐయ్యముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి

ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్


చెలులందరికీ వ్రతం యొక్క విశేషాలు చెప్పిన తర్వాత గోదాదేవి ఆ వ్రత నియమాలను ఈ పాశురంలో వివరించింది.. భగవంతుని దర్శించుటకు వెళ్ళేవాళ్లు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. శ్రీకృష్ణుడు అవతరించిన లోకంలో పుట్టి దుఃఖమయమైన జీవితం గడుపుతున్నా ఆ భగవంతుడి అనుగ్రహంతో ఆనందంగా ఉన్నవారలారా ఈ తిరుప్పావై వ్రతం కొరకు మేము ఏర్పరుచుకున్న వ్రత నియమాలు వినండి. ముందుగా పాలసముద్రంలో నిద్రించుచున్న శ్రీహరి యొక్క పాదపద్మములకు మంగళము పాడుదాము. ఈ వ్రతం ఆచరించు సమయంలో నేతిని, పాలను గాని తీసుకోము. తెల్లవారుఝామునే లేచి చన్నీటి స్నానం చేసి కళ్లకు కాటుక ధరించక కేశములకు పరిమళాన్ని ఇచ్చే పూలను ధరింపకుండా ఉందాము. మా పెద్దలు విడిచిపెట్టిన చెడుపనులను మేము ఆచరింపము. ఇతరులకు బాధ కలిగించే మాటలు, అసత్యాలు ఎప్పుడు గాని, ఎక్కడా గానీ మాట్లాడము. ఇతరులకు హాని కలిగించే కష్టములు కలిగించే పనులనుగాని, ఆలోచనలు గాని చేయము. మహాత్ములైన వారిని సేవించి ధనధాన్యాలతో సత్కరిస్తాము.


బ్రహ్మచారులకు, బిక్షువులకు బిక్ష పెడతాము. భగవంతుని గుణగణనము చేస్తూ ఈ సంసార బంధనాలనుండి విముక్తి పొండడం గురించి ఆలోచిస్తాం .. శాస్త్రముకంటే నిర్దిష్టమైన క్రమము కంటే భక్తి ప్రధానమైంది. భగవత్కృప, గురు కృప చాలా ముఖ్యమైనవని భావిస్తాము. దేవతలు మనపై కోపించినప్పుడు గురువు మనకు ఎటువంటి హాని కలగకుండా రక్షిస్తాడు. కాని గురువుకు కోపం వస్తే మనను రక్షించేవాడు లేడు. అందుకే గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానంగా భావించాలని పెద్దలు చెప్పారు. శ్రీకృష్ణునిసేవకే అంకితమైనందున తన యవ్వనమంతా ఆ శ్రీకృష్ణుడి సొంతమని భావించిన గోడాదేవి ఈ పాశురంలో వ్రత నియమాలు చెప్పింది..