Thursday, December 17, 2020

పాశురము - 15వ రోజు

 తిరుప్పావై --- 15 పాశురం



ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో

శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్

వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్

వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ

ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై

ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్

వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క

వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్


రాగం : భైరవి

ఏమే చిన్నారి చిలుకా! ఎన్నాళ్ళె నీ నిదుర?

జిల్లుమని పిలువకుడె ఓ తల్లులార! ఇదె వచ్చేను.

నీ నోటివాటము, నీ మాట పాటవము

తెలిసికొన్నాములే తెమలవే కలికి! //చిన్నారి //

మాటకారులు మీరే - పోనీ నేనవుతాను

ఏమిటే నీ గొప్ప ఒప్పులకుప్ప?

వచ్చిరా అందరు? ఆఁ! - లెక్కించుకో

మత్తగజముల, శాత్రవుల మదమునణచిన

మాయావి కృష్ణుని మనము కీర్తింపగ

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము



ఈరోజు గోపిక అహంకారము తొలగి పరిపూర్ణ స్థితిలో ఉంది. ఆమె అప్పటికే నిద్రలేచి నిన్నటి పాశురం మధురంగా పాడుకుంటుంది. ఆమెను మేల్కొల్పడానికి వచ్చిన గోపికల బృందం అది విని ఇలా సంభాషించారు.

ఓ లేతచిలుకా! ఇంకా నిద్రలోనే ఉన్నావా?

అలా జిల్లుమని పిలవకండే.. ఇదిగో వస్తున్నానుగా..

అమ్మో నీవు మంచి నేర్పరివి, మాటకారివే. నీ నోటివాటం మాకు తెలీదా?

మీరే మాటకారులు! పోనీ నేనే అవుతాను

ఏమిటే నీ గొప్ప? తొందరగా తెములు.

అందరూ వచ్చారా?

ఆ! వచ్చారే! కావాలంటే నీవే లెక్కించు

సరే! నేను వచ్చి ఏం చేయాలి? చెప్పండి

మదించిన ఏనుగును మట్టుపెట్టినవాడు, శత్రువుల గర్వాన్ని అణచినవాడు, మాయావి ఐన ఆ శ్రీకృష్ణుడిని కీర్తిద్దాం రావమ్మా!

ఈ రోజు జరిగిన గోపికా సంవాదంలో మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు అర్ధమవుతాయి. తాను అందరిలా నిద్రపోక , వేకువఝామునే మేలుకున్నా కూడా తోటివారు ఇంకా నిద్రపోతున్నావా? అని నిష్టూరమాడేసరికి భరించలేకపోయింది.తన మంచితనాన్ని నిరూపించుకోవడానికి వారి పరుష ప్రవర్తనను బయట పెట్టింది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి ఇటువంటి ప్రవర్తన మంచిది కాదు. ఒకరితో ఒకరు వాదిస్తే హృదయంలోని భగవదనుభవం తరిగిపోతుంది. అందుకే లోపలున్న గోపికకు జ్ఞానోదయమై నేనే కఠినురాలిని అని ఒప్పుకుంది. మన తప్పు ఉన్నా లేకున్నా పెద్దలు ఉన్నది అంటే మనసులో కూడా బాధపడక సంతోషంతో స్వీకరించడమే క్షమాగుణంలోని పరాకాష్ట. మనలోని దోషాలను ఎత్తి చూపినవారిని శత్రువులుగా ద్వేషించక, శ్రేయోభిలాషులుగా భావించి నిందాస్తుతులను సమానంగా స్వీకరించాలి. స్తుతిని నిందగానూ, నిందను స్తుతిగానూ భావించి తనను తాను సరిదిద్దుకునేవాడే భాగవతోత్తముడు. అంతే కాదు ఒకరికంటే ఒకరు తక్కువ వారము అనుకోవడం ఉత్తమ శ్రీవైష్ణవ లక్షణం. అందుకే లోపలున్న గోపిక ముందు నిష్టూరాలాడినా తర్వాత నింద తనమీదే వేసుకుంది.

భగవంతుని దర్శనానికి వెళ్లేటపుడు పదిమంది భాగవతోత్తములైన ఆళ్వారులను సేవించి తోడ్కొని పోయినట్టు గోదాదేవి పదిమంది ఉత్తములైన గోపికలను మేల్కొలిపి శ్రీకృష్ణుడుండే భవనానికి చేరుకుంది... దీనితో శ్రీవ్రతం అనబడే తిరుప్పావై వ్రతం పూర్వభాగం పూర్తైంది. భగవంతుని భక్తులను మేల్కొల్పడం పూర్వభాగం. భగవానుని మేల్కొల్పడం ఉత్తరభాగం.

పాశురము - 14వ రోజు

 తిరుప్పావై --- 14 పాశురం



ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్

శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్

శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్

తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్

ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్

నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్

శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం

పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్


రాగం: దేశి


నీ పెరటి తోటలో, ఆ నడిమి బావిలో

కమలాలు పూసినవి - కలువలు కనుమూసినవి

కాషాయములు దాల్చి కదలిరదె జీయరులు

కుంచకోలల కోవెలలు తెరువంగ //నీ పెరటి//

మునుముందు మమ్ముల మేలుకొలిపెదనంచు, పూర్ణా!

బీరములు ఆడి నీవు మాట మరచితివే - లజ్జావిహీనా!

శంఖచక్రధరుని పంకజనేత్రుని

విశాల బాహుని నామము పాడగరావే! మధురభాషిణి!

జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము.


అందరికంటే ముందు లేచి అందరినీ మేల్కొలుపుతాను అని మాట ఇచ్చి మరచిపోయి ఇంకా నిద్రపోతున్న గోపికను ఈరోజు మేల్కొల్పుతున్నారు. ఈ గోపిక ఉన్నది ఒక విశాలభవనం. దాని వెనకాల తోటలో అందమైన కొలను. అందులో కలువలు తామరలు కదలాడుతూ అందంగా ఉన్నాయి. "అమ్మా! చూశావా? కలువపూలు ముడుచుకుంటున్నాయి. తామరపూవులు వికసిస్తున్నాయి. తెల్లవారిందమ్మా లే! ఎర్రని కాషాయవస్త్రాలు ధరించి, తెల్లని పలువరుస కలిగిన సన్యాసులు దేవాలయాలు తెరిచి ఆరాధన చేయడానికి వెళ్తున్నారు. అందరికంటే ముందుగా లేచి మమ్మల్నందరినీ లేపుతానని మాట ఇచ్చి తప్పావు. సిగ్గులేనిదానా! మంచి మాటకారివే! పరిపూర్ణురాలా! ఆజానుబాహువు, పుండరీకాక్షుడు, శంఖచక్రాలను ధరించిన ఆ శ్రీమన్నారాయణుని కీర్తిద్దాం . రా తొందరగా!


మన శరీరమనే భవనంలో వెనుక ఒక తోట ఉంది. అది భగవంతునితో కలిసి విహరించే స్థలం. అదే మన వెన్నుపూసలో ఉండే నాడీమండలం. మన నాభినుండి శిరఃస్థానం వరకు ఉన్న నాడీమండలంలో ప్రయాణం చేసి భగవంత్ తత్వాన్ని దర్శించాలి. ఆ తోటమధ్యలో కొలను అందులొ వికసించిన పద్మాలు. నాడీమండలంలో ఉండే చక్రాలనే పద్మములని అంటారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారములు అనే ఏడు పద్మాలు వికసించాయి. దానికర్ధం జ్ఞానేంద్రియాలు వికసించాయన్నమాట. ఇక కలువలు ఇంద్రియాలు. నిద్రిస్తున్న గోపికను పరిపూర్ణులారా అన్నారు. ఆమె కృష్ణప్రేమలో పూర్తిగా మునిగిపోయి ఉన్నది.. కాషాయములు ధరించిన సన్యాసులు కుంచెకోలలను చేతబట్టుకుని ఆలయాలు తెరిచి ఆరాధన చేయడానికి వెళ్తున్నారట. కాషాయం వైరాగ్యానికి చిహ్నం..గురువుల ఉపదేశమే హృదయమనే ఆలయపు తలుపును తెరిచే కుంచెకోల.

పాశురము - 13వ రోజు

 తిరుప్పావై --- 13 పాశురం



పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై

కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్

పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్

వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు

పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్

కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే

పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్

కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్


రాగం: వలజి


బకాసురుని డంబమడచిన దామోదరుని

దుష్తరావణుద్రుంచిన శ్రీరాముని

నామము పాడగ కన్నెపడుచులు

నోము సీమను చేరి వేచి యున్నారు //బకాసురుని//

శుక్రుడుదయించెను - గురుడస్తమించెను

పక్షులదెకూసెనే - పడతిమేల్కాంచవె -

చల్లని నెట జలకాలు ఆడవే - కపటము వీడవే

మంచమ్ము విడిరావె - మాతోడ కలియవే!

జగతికే మంగలము కూర్చుమన శ్రీవ్రతము


రోజు ఒక గోపికను నిద్రలేపడమేంటి అనిపించవచ్చు కాని గోపికలనే ఆళ్వారులను కీర్తిస్తూ నిద్ర మేల్కొలిపి వారిని తోడ్కొని ఆ పరమాత్మ సన్నిధికి చేరాలి అనే అద్భుతమైన భావం ఈ పాశురాలలో ఉంది. ఈనాడు మేల్కొలిపే గోఫిక నేత్రాలు చాలా అందమైనవి. అందరినీ ఆకర్షించే తుమ్మెదతో కూడిన తామరపూవులాంటి కళ్లు, లేడి చూపులు కలిగి ఉన్నది. ఈ నేత్ర సౌందర్యమే ఆ శ్రీకృష్ణుని తన వద్దకు తీసుకొస్తుందనే నమ్మకం కలిగి ఉన్నది. ఇక్కడ నేత్రమంటే జ్ఞానం. జీవుడు పరమాత్మకే చెందినవాడు రక్షింపబడేవాడు, దాసుడు అని తెలుసుకున్నవారు ఆ పరమాత్మను పొండడానికి ఎటువంటి ప్రయత్నము చేయరు. ఈ స్థితిలో ఉన్న గోపికను గోదాదేవి మేల్కొలుపుతుంది.


బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని, దుష్టుడైన రావణాసురుని చంపిన శ్రీరాముని కీర్తిని గానం చేస్తూ మన తోటి పిల్లలందరూ అప్పుడే వ్రతక్షేత్రానికి చేరారు. తుమ్మెద కలిగిన తామరపూవులలాంటి కళ్లు ఉన్న చినదానా! శుక్రుడు ఉదయిస్తున్నాడు. గురుడు అస్తమిస్తున్నాడు. లేడి చూపులు కలిగినదానా! పక్షులు కూయుచున్నవి. ఈ శుభదినాన శ్రీకృష్ణవిరహం తీరి చల్లబడేట్టుగా నీటమునిగి స్నానం చేయకుండా ఇంకా శయ్యపై పడుకుని ఉన్నావా? ఓ సుకుమరి తొందరగా వచ్చి మాతో కలువుము...


భగవంతుని తత్వాన్ని మన నుండి దూరం చేయడానికి వచ్చే శత్రువులే ఈ బకాసురుడిలాంటి రాక్షసులు. అమాయకంగా ఏమీ తెలియనట్టు బయటకు కనిపిస్తూ మనసులో మాత్రం కృష్ణుని చంపి తినవలెనని ఆలోచన కలిగి కొంగ రూపంలో నిలిచాడు బకాసురుడు. తనను అంతమొందించడానికి వచ్చినదని గ్రహించిన శ్రీకృష్ణుడు దాని నోటిని చీల్చి అంతమొందించాడు. ఒక విధంగా ఉన్నవారు వేరొక విధంగా కనపడాలని చేసే ప్రయత్నమే దంబము. దంబము కంటే ప్రమాదకరమైంది అహంకారము. ఇక్కడ ప్రస్తావించిన రావణాసురుడు అహంకారము. నేను కాని దానిని నేను అనేవిధంగా చెసేదే అహంకారం. అశాశ్వతమైన శరీరమే ఆత్మ అని ఆలోచన ఈ అహంకారం వల్లనే కలుగుతుంది. అది కలిగిన వెంటనే ఆత్మకు, పరమాత్మకు గల సంబంధం తెగిపోతుంది. బకాసురుని కృష్ణుడు, రావణాసురుని రాముడు సంహరించడం తమకోసమే అని గోపికలు ఆనందంతో కీర్తిస్తూ ఆనందిస్తున్నారు.


శుక్రుడు ఉదయించడం, గురుడు అస్తమించడం ప్రాతఃకాలానికి ముందు వచ్చే గుర్తు. మనలో సాత్వికమైన భావం కలిగి, భగవంతుని వైపు మన బుద్ధి నిలవడానికి ముందుగా శుక్రుడనే జ్ఞానం ఆవిర్భవించి, అజ్ఞానమనే గురుడు అంతరించాలి. శుక్రుడు మృతసంజీవని విద్యకలిగినవాడు. శుక్రుని పూజించి మనము అమృతత్వం సాధించడం అంటే చావు లేకుండా ఉండడం కాదు ఆ భగవంతునికి దూరం కాకుండా ఉండడం. అసురులను ఆకర్షించడానికి నాస్తిక మతాన్ని ప్రచారం చేశాడు గురుడు. అతను అస్తమిస్తున్నాడంటే మనలోని నాస్తిక భావాలు నశించి భగవంతునియందు నమ్మకం మొదలైనదన్నమాట. అందుకే ఇది చాలా మంచి సమయం నిద్ర లెమ్మని అంటున్నారు.

పాశురము - 12వ రోజు

 తిరుప్పావై --- 12 పాశురం



కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి

నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర

ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్

పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి

శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త

మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్

ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్

అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్


రాగం : రేవతి


లేగలను తలచి జాలిగొని అరచి

ఎనుములు సిరములు పాలుధారగ కురియ

వీడెల్ల నాని చిత్తడి ఆయనే చెలియ!

మేటి సంపదలున్న మొనగాడి చెల్లెలా!

మంచు మాతలలపై పడగ నీ వాకిలి పట్టి

కోపమున రావణుని కూల్చిన శ్రీరాముని

కీర్తింపగ, పెదవి కదపవేమె కలికి!!

మాయ నిద్రను వీడి మేలుకోవమ్మ!

నీ సంగతులు తెలిసె లే! బంగారు బొమ్మ

జగతికే మంగళం కూర్చు మన శ్రీ వ్రతము


నిన్నటి పాశురంలో గోపాలురు ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా స్వధర్మాన్ని ఆచరించేవారని చదువుకున్నాం కదా. ఈరోజు ఆ స్వధర్మం కూడా అవలంభించని ఓ గోపిక గురించి తెలుసుకుందాం. ఈ గోపికనే గోదాదేవి, ఇతర గోపకాంతలు మేల్కొల్పుతున్నారు. ఈమె స్ధితప్రజ్ఞత అవస్ధలలోని తొలిదశ యతమానావస్ధలో ఉంది. తాబేలు తన అవయవములను మొత్తం లోపలికి లాక్కుని ఉంటుంది అదేవిధంగా ఈ గోపిక వలెనే ఇంద్రియములను ఇంద్రియ విషయములనుండి పూర్తిగా ఉపసంహరించినవాడే స్ధితప్రజ్ఞుడు అవుతాడు. ఈ గోపిక శ్రీకృష్ణుడి ఆప్తమిత్రుడు శ్రీదాముని సోదరి. అతను కృష్ణు డి సేవలో పూర్తిగా మునిగిపోయి తన ఇంటిలోని గేదెల పాలు కూడా పిండడం లేదు. ఆ గేదెలు తమ పాలు పిండేవారు లేక తమ లేగదూడలు కూడా పాలు త్రాగకపోవడంతో పొదుగుల బాధతో అరుస్తూ వాటిని తలుచుకుంటూ పాలను నేలపై స్రవించాయి. ఆ పాలతో ఇల్లంతా చిత్తడిగా మారింది. ఈ వేకువజామున మంచు మా తలలపై కురుస్తున్నా నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటివాకిట నిలబడ్డాము. బురదలో కాలు జారకుండా మీ ఇంటి వాకిటి పై దండెను పట్టుకొని నిలబడ్డి తన భార్యను అపహరించిన ఆ లంకాధీశుని చంపిన శ్రీరామచంద్రుని కీర్తిస్తున్నాము. అది విని కూడా నీవు పెదవి విప్పడంలేదు. ఇదేమి గాఢనిద్ర?. లేచి రావమ్మా ఇప్పటికే ఇరుగుపొరుగు వాళ్లు కూడా వచ్చి నీ నిద్రను చూస్తున్నారు.


గేదెలు దూడలకై చేపు వచ్చి అరుస్తున్నాయి. తమను తాము పోషించుకోని వారు లేగదూడలవంటివారు. ఆవులు, గేదెలు ఉదారులైన గురువులు. ఈ గేదెలకు సమృద్ధిగా పాలు ఉండడమంటే వారికి భగవదనుగ్రహం సంపూర్ణంగా ఉండడం. కట్టి ఉంచిన దూడలు తమ తల్లి వద్దకు చేరుకోలేనట్టే జీవుడు తన కర్మపాశంతో, అవిద్యతో ఈ శరీరమనే దుంగకు కట్టబడ్డాడు. దానిని వదిలించుకుంటే గాని భగవంతుని చేరలేడు. అతనిని ఆ పరమాత్మ వద్దకు చేర్చేవాడే గురువు. క్రింద నేలంతా బురదగా మారి పైన మంచు కురుస్తుంది. భగవంతుని అనుభవప్రవహమే ఈ నేలపై ఉన్న తడి, మంచు ఆళ్వారుల దివ్య సూక్తులు. భగవంతుని అనుభవంలో చేరడానికి సాయం చేసే దివ్యమంత్రమే అష్టాక్షరి. ద్వారం మీద ఉన్న దండెను పట్టుకుని ఈ గోపికలు రావణాసురుని చంపిన రాముడి గుణగానం చేస్తున్నారు. రావణుడు పాలించిన లంకయే మన శరీరము కాగా ఆ రావణుడే మన మనస్సు. దశేంద్రియాలే ఆతని పది తలలు. మనస్సును నిగ్రహించుకుని సీత(ఆత్మ) ను తనలో చేర్చుకున్నాడు శ్రీరాముడు. అందుకే ఆతని కీర్తిస్తున్నారు.

పాశురము - 11వ రోజు

 తిరుప్పావై --- 11 పాశురం



కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు

శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం

కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే

పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్

శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-

ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ

శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-

ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎన్బావాయ్


రాగం: కేదారగౌళ


వేల లేగదూడల ఆవుల పాలు వేగ పిడికెడువారు

అరుల బలము అణగ పోరు సైపెడువారు

దోషమించుక లేని గోప వంశస్వర్ణలతా!

పుట్టలోని పాము బోలు కటికల వనమయూరీ!

రావే! వయ్యారీ! రావే! శ్రీమంతురాలా! //లేగదూడల//

చుట్టాలు చెలులూ అందరు నీ ముంగిట నిలచీ

నీలమేఘ శ్యామ సుందరుని కీర్తింప

ఉలుకవు పలుకవు నీ నిద్రకర్ధమేమి?!

చెలియరో చెప్పవే - వేగ మేల్కొనవె

జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము..



ఈరోజు నిద్ర మేల్కొల్పే గోపిక కులంలో, గుణంలో, అందంలో మిన్నయైనదై కృష్ణుడివలెనే వ్రెపల్లెలో అందరి మన్ననలను పొందింది. భగవంతుని కైంకర్యమే ఐశ్వర్యంగా భావిస్తుంది ఈ గోపిక. వివిధములైన ధర్మములను ఆచరిస్తూ వాటి ఫలితములకోసం ఎదురుచూడక అవి భగవదారాధనా రూపాలని భావిస్తుంది.



ఈ గోపికను గోదాదేవి ఇలా మేల్కొపుతుంది. "లేగదూడలు కల ఆవులైనా దూడలవలె ఉన్న పలు ఆవుల మందల పాలు పితికేవారు, శత్రువులను బలాన్ని నశింప చేయడానికి యుద్ధం చేసేవారు, ఎట్టి దోషము లేనివారైన గోపాలవంశాన జన్మించిన ఓ స్వర్ణలత! పుట్టలోని పామువలె నున్న నడుము గలదానా! వనమయూరీ! సంపన్నురాలా! రమ్ము. చుట్టాలు, చెలికత్తెలు అందరూ వచ్చారు.. నీలమేఘశ్యాముడైన ఆ శ్రీకృష్ణుని నామాలను గానం చేస్తున్నారు. అయి నా నీవు ఉలకవు. పలకవు. దేనికోసం ఇంతగా నిద్రిస్తున్నావో చెప్పమ్మా!"



వ్రేపల్లెలోని ఆవులు దూడలు కలిగి ఉన్నా కూడా శ్రీకృష్ణుని వేణుగానము, స్పర్శచే సమృద్ధిగా పాలు ఇస్తున్నాయట. ఆ గోవులే సంసారబంధం వదిలిపెట్టిన ముక్తపురుషులు. వారి వయస్సు ఎప్పటికీ 25 ఏళ్లే.. ప్రకృతితత్వాలు 24 కాగా ఇరవై ఐదవది జీవతత్వము. ప్రకృతితత్వాలను దాటుకుని స్వస్వరూపంలో ఆవిర్భవించినవాడు ముక్తపురుషుడు. అలాగే భగవంతుడే కాక భాగవత్ శేషత్వాన్ని కలిగి ఉండడవల్ల ఈ గోపిక ధృఢమైన బంగారు తీగవలె కనిపిస్తున్నదట. ఆ గోపిక పడుకున్న తీరు ఎలా ఉందంటే పుట్టలోని పాములాంటి నడుము కలిగి ఉన్నది. మన శరీరంలోని మూలాధారంలో కుండలినీ శక్తి పుడుతుంది. ఈ కుండలినీ సర్పం ఆకారంలో 3 1/2 చుట్టలు చుట్టుకుని ఉంటుంది. దీనిని మూలాధారం నుండి కదిలించి పైన శిరస్సులో ఉన్న సహస్రార చక్రంలో ప్రకాశింపచేయాలి. ఆమె కేశాలు నెమలి పురివిప్పినట్టుగా ఉన్నాయి . శ్రీవిద్యా సంప్రదాయం తెలిసి, హఠయోగంలో ప్రాణాయమం చేసే యోగులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ పాశురంలో చెప్పబడిన గోపాలవంశంవారు తమ సంపదనంతా భగవంతుడు, భాగవత్ కైంకర్యానికే వినియోగించేవారు. అట్టి వంశానికి చెందిన గోపికను ఈ రోజు మేల్కొలిపి తమతో పాటు శ్రీవ్రతాన్ని ఆచరించడానికి తీసికెళ్లారు.

పాశురము - 10వ రోజు

 తిరుప్పావై --- 10 పాశురం



నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్

మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్

నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్

పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్

కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం

తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో

ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే

తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్


రాగం: పూరీ కళ్యాణీ


నోచి స్వర్గభోగముల తేలేటి ఓ తల్లి!

తలుపు తీయకున్నావు! మాటయిన అనరాదా

తులసి కిరీటధారి నారాయణుని మనము

సేవించితే చాలు - పరనొసగు పుణ్యమూర్తి

ఆనాడు శ్రీరామునిచే మృత్యువు వాతబడిన

కుంభకర్ణుడు ఓట్ అతని గాఢ నిద్ర నీకొసగెనా?

నిద్రమత్తుని వీడి ఓ నీలవేణి!

తెప్పరిల్లుచు వచ్చి తలుపు తీయగరావె!

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.



ఈరోజు నిద్ర మేల్కొలిపే గోపిక శ్రీకృష్ణుని పొరుగింటి పిల్ల. ఈమె తనకు తానుగా కృష్ణుడికోసం ఎదురు చూసేది కాదు. ఆ కృష్ణుడే తన వద్దకు వస్తాడనే నమ్మకం కల చిన్నది. ఈ గోపిక ఫలితం వచ్చినా రాకున్నా దాని వల్ల వచ్చే లాభనష్టాలన్నీ భగవంతుడివే కాని తనవి కావనే నిశ్చింతతో నిద్రపోతుంది. నిద్రపోతున్నప్పుడు మనసు తప్ప ఇంద్రియాలన్నీ పని మానేస్తాయి. కాని ఆ మనసు మాత్రం పరమాత్మనే తలుచుకుంటూ ఉంటుంది. అలా నిద్రపోతున్న గోపికను గోదా, మిగిలిన గోపికలు కాస్త వ్యంగ్యంగా మేల్కొల్పుతున్నారు.


"ఏమమ్మా! మాకంటే ముందే నోము నోచుకుని స్వర్గంలోకి ప్రవేశించావా? పోనీ వాకిలి తెరవకున్నా పర్లేదు. ఈ ఒక్క మాటైనా చెప్పు. పరిమళించే పవిత్రమైన తులసీదళాలు ధరించిన నారాయణుడు మాచే వేనోళ్ల కొనియాడబడి మాకు పురుషార్ధాన్ని ఇస్తున్నాడు కదా. ఆ రామచంద్రుని మూలంగా మృత్యువు నోటిలోకి త్రోయబడిన కుంభకర్ణుడు నీతో అతని గాఢనిద్రను పణంగా పందెం కాచి ఓడిపోయి నీకు ఇచ్చి వెళ్ళాడా? చెప్పమ్మా! మరీ ఇంత మొద్దు నిద్దరైతే ఎలాగమ్మా? మాకందరికి అరుదైన శిరోభూషణమైనదానివి నీవే కదా తల్లీ. ఇకనైనా నిద్ర లేచి వచ్చి తలుపు తెరిచి మాతో మాట్లాడు....

ఇక్కడ స్వర్గమనగా భగవదనుగ్రహం. ఆనందము. భగవంతునితో కలిసి ఉండడమే స్వర్గంతో సమానం. అంతేకాక ఈ పొరుగింటి గోపిక కోసం ఆ శ్రీకృష్ణుడే వ్రతం చేస్తున్నాడంట.. ఒకరిని పొండడానికి ఒకరు వ్రతం చేస్తున్నారు. అందుకే ఆ దేవదేవుడు ధరించే తులసీమాలల సౌరభాలు బయటకు కూడా వస్తున్నాయి. ఆ పరమాత్మ వద్దకు వెళ్లి మనమేమీ అడిగే పని లేదు. మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. మనకు కావలసిన వన్నీ తానే తెలుసుకుని ఇస్తాడు.

పాశురము - 9వ రోజు

 తిరుప్పావై --- 9 పాశురం



తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్

దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం

మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్

మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్

ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో

ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో

మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు

నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్


రాగం : అమీర్ కళ్యాణి


మేలి రతనాల మేడలో చుట్టూ దీపాలు వెలుగ

ధూపాలు వీవ, మేలితల్పాన నిదురించు

మా మామ కూతురా! మణితలుపు గడి తెరువు // మేలి రతనాలు //


అత్తా! ఆమెను లేపవమ్మా! నీ తనయ

మూగదా లేక చెవిటిదా? అలసినదా?

కావలి ఉంచిరా! మంత్రము వేసిరా!

మహా మాయావీ! మాధవా! వైకుంఠవాసా! అని

పలు తిరునామములు అనుసంధించుము - ఆమె మేల్కొనగ

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము..


ఇంతకుముందు రెండు పాశురాలలో శ్రవణం యొక్క ప్రాధాన్యత చెప్పబడింది. 8 - 12 పాశురాలలో మననం, ధ్యాన ప్రాముఖ్యం గురించి నిరూపించబడింది. అట్టి ధ్యానంలో పరాకాష్ట చెందిన గోపికను ఈనాడు మేల్కొపుతున్నారు..


నీ మేడ ఉజ్వలము, పరిశుద్ధమైన నవరత్నాలతో నిర్మించబడింది. ఆ మేడలో మెత్తని పాన్పుపై కళ్ళుమూసుకుని హాయిగా నిద్రపోతున్నావు. నీ చుట్టూ దీపాలు ప్రకాశిస్తున్నాయి. అగరుధూపాల పరిమళాలు వ్యాపించాయి. ఇంకా నిద్రపోతున్న ఓ అత్త కూతురా! లేచి మణికవాటము యొక్క గడియను తీయుము. అత్తా! నువ్వైనా ఆమెను లేపరాదా? ఏం? నీ కూతురు మూగదా? లేక చెవిటిదా? లేక అలిసిపోయి ఉన్నదా? ఎవరైనా నువ్వు కదిలితే మేము ఊరుకోము అని కట్టడి చేసి కాపలాగా ఉన్నారా? అలా మొద్దు నిద్రపట్టేట్టుగా ఎవరైన మంత్రం వేసారా?అయితే మాధవా! మాయావీ! వైకుంఠవాసా! ఆని ఆ నారాయణ నామస్మరణ చేసి ఆమెను మేల్కొలుపు. ఆమె లేచి మాతో వచ్చి చేరుతుంది. అని గోదాదేవి గానం చేసింది.


ఈనాటి గోపిక స్థితి వశీకావస్థలో ఉంది. భగవంతుదే సర్వస్వం అని తెలుసుకున్నదై ఆతని చేరడానికి ఆరాటపడక స్వప్రయత్నం పూర్తిగా వదిలిపెట్టి ఏ పనీ చేయక మూగ, చెవుడు కమ్మినట్టుగా గాఢనిద్రలో ఉంది. ఆ మేడ పరిశుద్ధమైన నవరత్నాలతో నిర్మించబడింది. భగవంతునితో జీవునికి గల సంబంధాలు కూడా తొమ్మిది విధాలు. 1.తండ్రి. 2. రక్షకుడు 3. శేషి. 4. భర్త. 5. జ్ఞేయుడు 6. స్వామి 7. ఆధారము 8. ఆత్మ 9.భోక్త.. ఈ నవవిధాలతో పరమాత్మను కూడి ఉండడమే ప్రజ్ఞ అంటారు. ఈ ప్రజ్ఞలో స్థిరంగా ఉండడమే స్తితప్రజ్ఞత. ఆ మేడలో దీపాల వెలుగుతో పాటు అగరు ధూపం పరిమళిస్తుంది. జ్ఞానం దీపంవంటిది కాగా ఆచరణ సుగంధం వంటిది. ఈ రెండు కలిగినవారికి ఆ భగవదనుగ్రహం సులువుగా లభిస్తుంది. ఈనాటి గోపిక సర్వభోగములు తన చుట్టూ పెట్టుకుని కూడా వాటిని అనుభవించకుండా తన మనస్సులో భగవంతుని నిలుపుకుని వశీకావస్థలో ఉంది. గోదాదేవి ఇతర గోపికల భగవన్నామస్మరణలు విని లేచి బయటకు వచ్చి వాళ్లతో కలిసింది.